కేటీఆర్ కి సైతం మొండిచేయి చూపించిన కేసీఆర్..

kcr-ktr | dandoraa.com

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీలో 105 మందితో కూడిన అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఈ కేటాయింపుల్లో తమకు స్థానం దక్కలేదని చాలా మంది నిరాశకు గురికాగా కొంతమంది ఏకంగా పార్టీనే విడిచిపెట్టి వలస వెళ్లారు. అలాంటి వారిలో కొండా సురేఖ, బాబు మోహాన్ లాంటి వారు ఉన్నారు. తానూ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదనే కేసీఆర్ పట్టుదల ముందు ఏది నిలబడం లేదు. చివరికి తన స్వంత కుమారుడు, రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ని సైతం లెక్కచేయకపోవడం విశేషం. ఈ విషయంలో కేటీఆర్ సైతం మనస్తాపానికి గురయ్యారని పలు కథనాలు వినిపిస్తున్నాయి.

అసలు విషయం ఏమిటంటే కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేరు రాకపోవడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. మేయర్ గా పదవి చేపట్టినప్పటి నుండి రాబోయే ఎన్నికలపైనే ఆశలు పెంచుకున్న రామ్మోహన్ తన చర్లపల్లి డివిజన్ ఉప్పల్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం అతన్ని కాదని గతంలో పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయినా భేటీ సుభాష్ రెడ్డికి తిరిగి సీటు కేటాయించారు. రామ్మోహన్ ని తన సోదరుడిగా భావించే కేటీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని తండ్రికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ‘నేను మోనార్క్ ని.. ఎవరి మాటా వినను’ అన్నట్లు కేసీఆర్ చివరికి తనయుడిని సైతం లెక్కచేయకపోవడంతో చేసేది ఏమీలేక రామ్మోహన్ ని బుజ్జగించే పనిలో పడ్డట్లు తెలిసింది.