కుక్కకు క్షమాపణ చెప్పలేదని… దారుణంగా హత్య చేశారు

delhi | dandoraa.com

తమ పెంపుడు కుక్కకు ఓ వ్యక్తి క్షమాపణలు చెప్పలేదని కోపోద్రిక్తులైన ముగ్గురు వ్యక్తులు తమ పొరుగింటి వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ మోహన్ గార్డెన్ లో ఉండే విజేందర్ రానా అనే వ్యక్తి మినీ ట్రక్కు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటిలాగే అతడు శనివారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. అతని వాహనాన్ని ఇంటి దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ చేస్తున్న సమయంలో అక్కడే తమ పొరుగింటి చెందిన పరాన్, అంకిత్, దేవ్ అనే ముగ్గురు వ్యక్తులు తమ పెంపుడు కుక్కతో బయటకి వచ్చి మాట్లాడుతూ నిలబడ్డారు. ఈ క్రమంలో విజేందర్ తన వాహనాన్ని పార్కింగ్ చేస్తుండగా పొరపాటున కుక్కకు తగిలింది. దీంతో అక్కడే ఉన్న వారు తమ కుక్కకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ విజేందర్ నిరాకరించడంతో పాటు మీ కుక్కను అదుపులో ఉంచుకోవాలని సూచించాడు. దీంతో ఆగ్రహించిన ఆ ముగ్గురు కూరగాయలు కోసే కట్టి, స్క్రూ డ్రైవర్ లతో అతడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో బాధితుడు కేకలు వేయగా అతని సోదరుడు ఇంటి నుండి బయటకు పరుగెత్తుకుంటూ రాగ అతనిపై సైతం దాడికి తెగపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ విజేందర్ ని ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.