రాజకీయ రణక్షేత్రంలో హాట్ టాపిక్ గా జగిత్యాల…

jagitiala | dandoraa.com

తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ముందస్తు ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అధికార, ప్రతిపక్షాల హవా కొనసాగుతుండగా కేవలం ఒక్క స్థానంలో మాత్రం తీవ్ర ప్రభావం చూపబోతున్నట్లు అనిపిస్తోంది. అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నియోజకవర్గం, ప్రస్తుత జిల్లా జగిత్యాల. రాష్ట్రంలో ఎక్కడా కూడా లేని విధంగా జగిత్యాల జిల్లా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మిగతా స్థానాల్లో ఎక్కడ కూడా లేని విధంగా ఈ ప్రాంతంలో మాటల యుద్ధం అప్పుడే మొదలైంది. నువ్వెంతా.. అంటే నువ్వెంతా అన్నట్లుగా ఈ ప్రాంతంలో రాజకీయ రణరంగం ఉగ్రరూపం దాలుస్తోంది. దీనంతటికీ కారణం లేకపోలేదు…

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పటి నుండే జగిత్యాలకు ప్రత్యేక స్థానం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం గత ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. దాదాపు అన్నిచోట్లా పై చేయి సాధించినప్పటికీ జగిత్యాల లో మాత్రం కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలైంది. గత నాలుగేళ్లుగా అక్కడి అసెంబ్లీ స్థానాన్ని ఏలుతున్న జీవన్ రెడ్డి ఇందుకు ముఖ్య కారణం. జగిత్యాల నియోజక వర్గాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న జీవన్ రెడ్డిపై పట్టు సాధించేందుకు టిఆర్ఎస్ తరపున ఎంపీ కల్వకుంట్ల కవిత యుద్దానికి దిగింది. ఒకవైపు ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు జీవన్ రెడ్డి పై మాటల తూటాలు పేల్చింది. అయితే ఆయనేం తక్కువ తినలేదు కదా.. కవిత పై తన వాక్ చాతుర్యంతో మాటల దాడికి దిగాడు. ఎంపీ కవిత జీవన్ రెడ్డిని ఉద్దేశించి ‘ముసలి పులి’ అని సంబోధించగా బదులుగా ‘ ఆమెకు మల్లె నాకు వడ్డాణం, బంగారం లేదు కదా’ అంటూ ఛలోక్తులు విసిరారు. ఇలాంటి తూటాలు ఎన్నో వారి మధ్య పేలుతూనే ఉన్నాయి. మరోవైపు జగిత్యాల నుండి ప్రచారాన్ని ప్రారంభించాలని అధికార టిఆర్ ఎస్ యోచిస్తుండగా, తామూ అక్కడి నుండే మొదలుపెడతామని మహాకూటమి తరపున టిటిడిపి నేత ఎల్.రమణ పేర్కొంటున్నారు. జగిత్యాల నుండి తనకు సీటు ఇవ్వకపోయినా టిఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన మహా కూటమి కోసం పాటుపడుతున్నారు. ఒకవైపు కవిత.. మరోవైపు జీవన్ రెడ్డి వీరిద్దరి మధ్య చెలరేగుతున్న యుద్ధంలో చివరికి ఎవరు విజయం సాధిస్తారో ఎన్నికలు జరిగే వరకు వేచి చూడాల్సిందే. వీరిద్దరిలో జగిత్యాల అసెంబ్లీ స్థానాన్ని ఎవరు గెలుచుకుంటారు అని అడిగితే ఎటూ తేల్చలేక రాజకీయ నిపుణులు సైతం తలలు పట్టుకుంటున్నారు అంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. చూద్దాం ముందు ముందు ఇంకా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో……